Delhi Girl Dragged Case : దిల్లీ సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమైంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేసిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.
'కారులో పాటలు పెట్టడం వల్లే..'
ఈలోగా రోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో వారు మత్తులో ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు అద్దాలు మూసి ఉండటం, కారులో పాటలు పెట్టడం వల్ల ప్రమాదాన్ని గుర్తించలేకపోయినట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
'ప్రమాదం కాదు.. కావాలనే..'
యువతి శరీరాన్ని ఈడ్చుకుపోయిన కారు.. యూటర్న్ తీసుకున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి. యువతి మృతదేహం కంజావాలా రోడ్డులో జ్యోతి గ్రామం వద్ద కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చని.. కావాలనే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. అప్పటికే మృతదేహం కారు చక్రాల వద్ద చిక్కుకుని ఉండగా కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తోంది. యువతిని కారు ఈడ్చుకెళ్లిన విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.