Delhi Footpath Accident : దిల్లీలోని సీమపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1:51 గంటలకు డీటీసీ డిపో వద్ద రెడ్‌లైట్‌ను దాటుతున్న ఓ గుర్తు తెలియని ట్రక్కు.. డివైడర్‌పై నిద్రిస్తున్న ఆరుగురిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు మార్గమధ్యంలో మృతి చెందారని వైద్యులు నిర్ధరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగో వ్యక్తి కన్నుమూశారు.
మృతులను కరీమ్ (52), ఛోటే ఖాన్(25), షా ఆలమ్(38), రాహుల్(45), గాయపడ్డ వారు మనీష్(16), ప్రదీప్(30)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.