Delhi Waterlogging : దేశ రాజధాని దిల్లీలోని పలుప్రాంతాలు ఇంకా వరద దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎర్రకోట, యమునానగర్, జమునానగర్, ఐటీఓ, హనుమాన్ మందిర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదనీరు ఇంకా నిలిచే ఉంది. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి చుట్టూ నీరు నిలిచే ఉంది. మరోవైపు, యమునా నది శుక్రవారం నుంచి కాస్త శాంతించింది. క్రమంగా నదీ ప్రవాహం తగ్గుతోంది. శనివారం ఉదయం 9గంటలకు 207.98 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగినట్లు కేంద్ర జలసంఘం ప్రకటించింది.
యమునా నదిలో నీటి స్థాయి క్రమంగా తగ్గుతోందన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అధిక వర్షపాతం లేకపోతే త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వజీరాబాద్, చంద్రవాల్ ప్రాంతాల్లో ఉన్న నీటి శుద్ధి కేంద్రాలు ఆదివారం నుంచి పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలన్నారు విజ్ఞప్తి చేశారు. వచ్చే 12 గంటల్లో దిల్లీ ప్రజలు ఉపశమనం పొందుతారని మంత్రి అతిషి తెలిపారు. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీళ్లన్ని దిల్లీకే విడుదల చేయడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌కు ఒక చుక్క నీరు కూడా ఎందుకు విడుదల కావట్లేదని ఆమె ప్రశ్నించారు. దీనిపై హరియాణా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.
అటు హిమాచల్‌ప్రదేశ్‌లో భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి. మనాలీ జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షానికి పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి. నదీపరివాహక ప్రాంతాల్లో పెద్దఎత్తున రోడ్లు కోతకు గురయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. గత వారం కురిసిన భారీ నుంచి అతి భారీవర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతోపాటు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. పెద్దఎత్తున రహదారులు దెబ్బతినటంతోపాటు మౌలిక సదుపాయాలకు తీవ్రంగా నష్టం జరిగినట్లు హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తాత్కాలిక సాయంగా రూ.2వేల కోట్ల సాయం ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
రహదారులపై విరిగిపడ్డ కొండచరియలు.. నిలిచిన రాకపోకలు..
కొండచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌లోని పలు రోడ్డు మార్గాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరకాశీ జిల్లాలోని చామి సమీపంలో కొండచరియలు విరిగిపడి.. యమునోత్రి రహదారి 123 పూర్తిగా బ్లాక్ అయింది. చమోలి జిల్లా పిపాల్‌కోటిలోని పాగల్ నాలా వద్ద బద్రీనాథ్ రహదారి కూడా బ్లాక్ అయింది. భారీ బండరాళ్ల పడటం వల్ల పిథోరఘర్ జిల్లాలోని ధార్చుల-తవాఘాట్-లిపులేఖ్ రహదారిని మూసి వేసినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని వారు వివరించారు. రోడ్లను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు.