తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2021, 9:14 AM IST

Updated : Jan 8, 2021, 5:38 PM IST

ETV Bharat / bharat

రైతులతో అసంపూర్తిగానే ముగిసిన చర్చలు- 15న మరోసారి!

Delhi Farmers' protests Live updates
దిల్లీలో 44వ రోజుకు చేరిన రైతన్నల నిరసన

17:10 January 08

మళ్లీ అసంపూర్తిగానే..

కేంద్రం-రైతుల మధ్య 8వ విడత చర్చలూ అంసపూర్తిగానే ముగిశాయి. ఇరువర్గాలు తమ వైఖరిపై కట్టుబడి ఉండటంతో పరిష్కారం తేలలేదు. జనవరి 15న మరోసారి చర్చలు జరిపేందుకు నిర్ణయించారు. 

  • రైతుసంఘాలతో కేంద్రం చర్చలు ఈ నెల 15కి వాయిదా
  • దిల్లీ: ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసిన చర్చలు
  • కేంద్రప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించని రైతుసంఘాలు
  • సాగుచట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టిన రైతు సంఘాలు
  • సాగుచట్టాలపై వెనక్కి వెళ్లేది లేదని మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

16:31 January 08

విజయమో... వీర స్వర్గమా అని అల్టిమేటం

సాగు చట్టాలు రద్దు చేసే వరకు దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు వెళ్లేది లేదని కేంద్రానికి రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. "విజయమో... వీర స్వర్గమా" అంటూ నినాదాలు చేశారు. ఓ రైతు నాయకుడు... అదే విషయాన్ని పుస్తకంపై రాసి ప్లకార్డులా ప్రదర్శించారు. ఏం స్పందించకుండా అలాగే కూర్చున్నారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న మంత్రులు ఒక్కసారిగా హాల్​ నుంచి బయటకు వెళ్లారు. వారు విడిగా చర్చించుకున్నారు. 

భోజన విరామం తీసుకునేందుకూ రైతు సంఘాల నేతలు నిరాకరించారు. సమావేశ మందిరంలోనే కూర్చుని ఉన్నారు. 

కేంద్రం చట్టాలను రద్దు చేయలేమని చెప్పినట్లు ఆల్​ ఇండియా కిసాన్​ సంఘర్ష్​ కో ఆర్డినేషన్​ కమిటీ సభ్యులు కవితా కురుగంటి చెప్పారు. 

15:13 January 08

ప్రతిష్టంభన వీడేనా..?

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం దిగి రావడంలేదు.. రైతులు వెనక్కి తగ్గడంలేదు.. దీంతో ఈ అంశంలో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరిగినా ఈ సమస్య కొలిక్కి రాకపోవడంతో దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు 44వ రోజూ కొనసాగుతున్నాయి. కటిక చలిని, అకాల వర్షాలను సైతం లెక్కచేయకుండా కర్షకులు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ రైతులతో మరోసారి చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో 41 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు  చట్టబద్ధత కల్పించే అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.

అయితే, సాగు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదనైనా పరిశీలిస్తామని చెబుతోన్న కేంద్రం.. ఈ చట్టాలను రైతులు అర్థంచేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, రైతుల మాత్రం సవరణలకు అంగీకరించేదిలేదని, వెనక్కి తీసుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది.

14:24 January 08

చర్చలు ప్రారంభం

దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో రైతులు-కేంద్రం మధ్య 8వ విడత చర్చలు ప్రారంభమయ్యాయి. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతన్నలు.. తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారు. చట్టాల రద్దు మినహా ఏ సవరణ చేయడానికైనా సిద్ధమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ దఫా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

రైతులు-కేంద్రం మధ్య ఇప్పటికే జరిగిన 7 విడతల చర్చలు విఫలమయ్యాయి. అయితే ఈసారి కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

12:40 January 08

భేటీకి బయలుదేరిన రైతన్నలు

  • సింఘు సరిహద్దు నుంచి విజ్ఞాన్ భవన్ కు బయలుదేరిన రైతు సంఘాల నేతలు
  • మ. 2 గంటలకు రైతు సంఘాలు, కేంద్రం మధ్య 8వ విడత చర్చలు
  • చర్చలకు నేతృత్వం వహించనున్న కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్​
  • చర్చల్లో పాల్గొననున్న 40 రైతు సంఘాల ప్రతినిధులు
  • కొత్త సాగు చట్టాల రద్దు, మద్దతు ధరకు చట్టబద్దతపైనే చర్చ
  • సాగు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదనైన పరిశీలిస్తామన్న కేంద్రం
  • సాగు చట్టాలను రైతు సంఘాల నేతలు అర్ధం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్రం
  • సవరణలకు అంగీకరించేదే లేదంటున్న రైతు సంఘాలు
  • కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్న రైతులు

12:30 January 08

'సానుకూల ఫలితాలు ఆశిస్తున్నాం'

కేంద్రంతో జరగనున్న చర్చల కోసం రైతు సంఘాలు బయలుదేరాయి. సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో భేటీకి వెళుతున్నట్టు భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రతినిధి రాకేశ్​ టికైట్​ వెల్లడించారు. 

మరోవైపు.. రైతుల ప్రధాన డిమాండ్​ అయిన సాగు చట్టాల రద్దు జరిగే పని కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. భేటీకి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించిన అఖిల భారత కిసాన్​ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్​.. మంచి ఫలితాలు రావాలని ఆశించారు.

12:30 January 08

12:10 January 08

''ఈసారి కొలిక్కి వస్తుంది'

మరికొన్ని గంటల్లో రైతులతో భేటీ జరగనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి. ఈ భేటీలో సమస్య ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి భేటీలోనే రైతులు తమ సమస్యలను స్పష్టంగా చెప్పి, చర్చించి ఉంటే ఈపాటికి ప్రతిష్టంభన వీడిపోయుండేదని పేర్కొన్నారు.

మరోవైపు చర్చలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ఫోన్​లో సంభాషించనున్నట్టు సమాచారం.

10:54 January 08

చర్చలకు సిద్ధం

దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రానికి- రైతులకు మధ్య.. 8వ విడత చర్చలు జరగనున్నాయి. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై రైతుల డిమాండ్ చేస్తుండగా.. సాగు చట్టాల రద్దు తప్ప ఏ ప్రతిపాదనైనా పరిశీలిస్తామని కేంద్రం అంటోంది. ఈ క్రమంలో కొత్త చట్టాల్లో కీలక సంస్కరణలను కూడా ప్రతిపాదించింది. విద్యుత్ రాయితీ, వ్యర్థాల విషయంలో రైతుల ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అయితే రైతులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో చట్టాల్లో సవరణలకు అంగీకరించేది లేదని.. రద్దు మాత్రమే తమకు సమ్మతమని అంటున్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించనంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి. చట్టాల అమలును రాష్ట్రాల స్వేచ్ఛకు వదిలేస్తారన్నదే నిజమైతే అది కేంద్ర ప్రభుత్వ విభజించు-పాలించు వ్యూహం అని రైతు సంఘాలు పేర్కొన్నాయి. అటు.. ఇప్పటివరకు జరిగిన 7 విడతల చర్చలు విఫలమవగా నేటి చర్చల్లో ఫలితం వస్తుందని కేంద్రం ఆశిస్తోంది.

09:02 January 08

44వ రోజు

  • దిల్లీ సరిహద్దుల్లో 44వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన
  • నేడు కేంద్రంతో రైతుసంఘాల ఎనిమిదో విడత చర్చలు
  • సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై రైతుల డిమాండ్
  • సాగు చట్టాల రద్దుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రైతుల డిమాండ్
  • సాగు చట్టాల రద్దు తప్ప ఏ ప్రతిపాదనైనా పరిశీలిస్తామన్న కేంద్రం
  • కొత్త చట్టాల్లో కీలక సంస్కరణలను ప్రతిపాదించిన కేంద్రం
  • విద్యుత్ రాయితీ, వ్యర్థాల విషయంలో రైతుల ప్రతిపాదనకు కేంద్రం సుముఖత
  • ఎట్టిపరిస్థితుల్లో చట్టాల్లో సవరణలకు అంగీకరించేది లేదంటున్న రైతులు
  • కేంద్రం సానుకూలంగా స్పందించనంత వరకు ఆందోళనలు: రైతు సంఘాలు
  • ఇప్పటివరకు జరిగిన 7 విడతల చర్చల్లో తేలని ఫలితం
  • ఇవాళ్టి చర్చల్లో పురోగతి లభిస్తుందని భావిస్తున్న కేంద్రం
Last Updated : Jan 8, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details