Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పాత్రపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. మద్యం స్కాం ఒక ఫేక్ కేసు అని.. కావాలనే సిసోదియాను ఇందులో ఇరికించారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐకి ఏ ఆధారాలు లభించలేదని అన్నారు. కాగా దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ తన మొదటి చార్జ్‌షీటును శుక్రవారం సమర్పించింది.
"మనీశ్ పేరు సీబీఐ చార్జ్‌షీటులో లేదు. ఇది ఫేక్ కేసు. సిసోదియాపై నిర్వహించిన సోదాల్లో ఏం దొరకలేదు. నాలుగు నెలలుగా 800 మంది అధికారులు దర్యాప్తు చేసినా ఏం లభించలేదు. దిల్లీ విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సిసోదియా.. పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించారు. అలాంటి మంచి వ్యక్తిపై ఓ తప్పుడు కేసు బనాయించి.. ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారు"
--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి