దిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఆదివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీ ఉపముఖ్యమంత్రి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా భారీగా మనీశ్ సిసోదియా నివాసానికి చేరుకున్నారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ సమాధికి మనీశ్ సిసోదియా నివాళులర్పించారు.
రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పిస్తున్న మనీశ్ సిసోదియా 'ఆదివారం మరోసారి సీబీఐ కార్యాలయానికి వెళ్తున్నా. విచారణకు పూర్తిగా అధికారులకు సహకరిస్తాను. కోట్లాది మంది దేశ ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయి. కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా పట్టించుకోను. నేను దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ అనుచరుడిని. నేను జైలుకు వెళ్తే నా కుటుంబసభ్యులను పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. నేను జైలుకు వెళ్తే విద్యార్థులు చదువు ఆగిపోదు.. జైల్లో నుంచి కూడా వారి పనితీరును అంచనా వేస్తాను.' అని సీబీఐ విచారణకు హాజరు కావడానికి ముందు మనీశ్ సిసోదియా ట్వీట్ చేశారు.
మనీశ్ సిసోదియా నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు 'దేశం, సమాజం కోసం జైలుకు వెళ్లడం గర్వకారణం'
విచారణ తర్వాత సిసోదియాను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తనకు సమాచారం అందిదని ఆప్ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దేశం, సమాజం కోసం జైలుకు వెళ్తే అది గర్వకారణమని పేర్కొన్నారు. జైలు నుంచి సిసోదియా త్వరగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దిల్లీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఆప్ నేతలు సిసోదియా కోసం ఎదురుచూస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మరోవైపు.. దిల్లీ లోధి రోడ్‌లోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్ద నిషేధాజ్ఞలు విధించారు. విచారణ తర్వాత సిసోదియాను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆప్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19నే సిసోడియాను సీబీఐ విచారణకు పిలవగా.. దిల్లీ బడ్జెట్ రూపకల్పన కోసం వారం సమయం కోరగా అంగీకరించింది.
ఇదీ కేసు..
దిల్లీలో 2022 నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోదియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.