Delhi Earthquake Today : దేశ రాజధాని దిల్లీని మంగళవారం భారీ భూకంపం వణికించింది. దిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం-NCRలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం వెల్లడించింది. నేపాల్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిల్లీతో సహా పొరుగున ఉన్న పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లో కూడా 40 సెకన్లపాటు భూమి కంపించిందని వెల్లడించింది.
వెంట వెంటనే భూ ప్రకంపనలు..
మంగళవారం మధ్యాహ్నం 2.25 సమయంలో మొదటిసారి 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) గుర్తించింది. ఇది పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఈ తీవ్రతను గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువ తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. కాగా, దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా రికార్డయింది.
ట్విట్టర్ వేదికగా పోలీసుల అలర్ట్..
రెండోసారి ప్రకంపనలు రావడం వల్ల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని దిల్లీ పోలీసులు కోరారు. 'దయచేసి భవన సముదాయాల్లో ఉన్న ప్రతిఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరూ లిఫ్ట్‌లు గానీ ఎలివేటర్లు గానీ వినియోగించవద్దని మేము అభ్యర్థిస్తున్నాము. ఎమర్జెన్సీ కోసం 112కు డయల్ చేయండి' అని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. రెండోసారి సంభవించిన భూకంపం తర్వాత దిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడం వల్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు కదలాడాయి.