Delhi Earthquake News :అఫ్గానిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో మన దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఈ క్రమంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంట్లోని ఫర్నిచర్ కదిలినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 2గంటల 50 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం కాబుల్‌కు 241 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.
మరోవైపు పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించినట్లు ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. భూకంప కేంద్ర హిందూకుశ్ ప్రాంతానికి 213 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయని ఓ అంతర్జాతీయ ఛానెల్ తెలిపింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కూడా భూకంపం వచ్చినట్లు వెల్లడించింది.
సాధారణంగా భూకంపాలు ఆసియా ఖండంలో అధికంగా వస్తుంటాయి. అందులోనూ భారత్‌లోని జమ్ముకశ్మీర్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, తజకిస్థాన్‌లు హింద్ కుష్ హిమాలయాన్ జోన్‌కు చుట్టుపక్కల వీటి కేంద్రాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు నమోదయ్యే జోన్ల జాబితాలో ఇది కూడా ఒకటి. భారత ఉపఖండ భూఫలకం యూరేషియా ఫలకంతో ఢీకొనడమే దీనికి ప్రధాన కారణం.
పాకిస్తాన్ 2005 అక్టోబరులో సంభవించిన భూకంపంలో 74,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, 2023 అక్టోబరులో అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల 2,000 మంది మరణించగా, మరో 9,000 మంది పైగా గాయపడ్డారు.
Japan Earthquake News :ఈ ఏడాది జనవరి1వ తేదీన జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం వల్ల 200మందికి పైగా మరణించారు. జపాన్‌లోని పశ్చిమ తీర ప్రాంతంలోని సుజు నగరంలోని దాదాపు అన్ని ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నా వాటి గోడలు బీటలు వారి నివసించడానికి పనికిరాకుండా పోయాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఆ ఇళ్ల సమీపానికి వెళ్లకూడదని, అవి ఏ క్షణం కూలిపోతాయో తెలియదని ప్రజలను ప్రభుత్వం హెచ్చరించింది.