Delhi Doctors Protest: నీట్- పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ మంగళవారం డాక్టర్లు చేపట్టిన ర్యాలీలోపోలీసులు ప్రవర్తించిన తీరును దిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. క్యాంపస్లో నిరసన చేపట్టారు. వీరిని పోలీసులు అడ్డుకోగా.. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్ నుంచి ఆందోళనకారులను బయటికి రాకుండా పోలీసులు నిలువరించారు. పోలీసుల తీరుకు నిరసనగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
వైద్యులు నిరసనల్లో పాల్గొనగా.. ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీలోని చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయం ఆస్పత్రి ఎదుట రోగులు గుమిగూడారు. ఆస్పత్రి మూతపడిందని తెలుసుకుని తిరుగుముఖం పట్టారు. తమ చిన్నారికి బాగాలేక ఆస్పత్రికి వస్తే.. లోపలికి అనుమితివ్వలేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
నిరసన వీడండి..:
వైద్యులు నిరసనను వీడాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైద్యులతో నిర్మాణ్ భవన్లో సమావేశం నిర్వహించారు. నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై నమోదైన కేసులో కేంద్రం గడువులోగా అవిడవిట్ను దాఖలు చేస్తుందని తెలిపారు. సమస్య పరిష్కారానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున కౌన్సిలింగ్ ఇప్పుడే నిర్వహించలేమని అన్నారు. కరోనా పరిస్థితుల్లో వైద్యుల సేవలను కొనియాడారు.
వైద్యులు- పోలీసుల ఘర్షణ..
NEET PG 2021 Counselling: నీట్- పీజీ 2021 కౌన్సెలింగ్‌లో జాప్యంపై మంగళవారం రెసిడెంట్ డాక్టర్ల నిరసన నాటకీయ మలుపు తిరిగింది. వైద్యులు, పోలీసు సిబ్బంది ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణల్లో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతృత్వంలో చేపట్టిన నిరసన కార్యక్రమం గందరగోళంగా మారింది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ నుంచి సుప్రీంకోర్టు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించడానికి ప్రయత్నించగా.. పోలీసులు చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.