Delhi Diwali Pollution Air Quality : దేశ రాజధాని దిల్లీలో దట్టమైన పొగ అలుముకుంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దిల్లీలో.. దీపావళి నేపథ్యంలో భారీగా టపాసులు కాల్చడం వల్ల వాయు నాణ్యత దెబ్బతింది. సుప్రీం కోర్టు నిషేధాన్ని లెక్కచేయకుండా దిల్లీవాసులు బాణసంచా కాల్చారు. ఫలితంగా భారీగా పొగ ఏర్పడి.. దాదాపు కొన్ని వందల మీటర్ల వరకు రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. సుప్రీం కోర్టు నిషేధం ఉన్నా అనేక మంది టపాసులు కాల్చారని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) గణాంకాల ప్రకారం.. ఆర్కే పురం, ఆనంద్ విహార్లలో 290, పంజాబీ బాగ్లో 280, ఐటీఓలో 263గా ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) రికార్డైంది.
ఎనిమిదేళ్లలో ఇదే తక్కువ
ఆదివారం సాయంత్రానికి దిల్లీలో వాయు నాణ్యత మెరుగ్గానే ఉంది. గడిచిన ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ సారి దీపావళి సమయంలో వాయు నాణ్యత మెరుగ్గా కనిపించింది. శనివారం 24 గంటల సగటు ఏక్యూఐ 220గా రికార్డైంది. ఇది ఎనిమిదేళ్లలో ఉత్తమం. నగరంలో వర్షం కురవడం, గాలి వేగం కారణంగా శనివారం కాలుష్యం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, ఆదివారం సాయంత్రం నుంచి దిల్లీ వాసులు భారీగా టపాసులు కాల్చారు. షాపుర్ జాట్, హౌజ్ ఖాస్ సహా పలు ప్రాంతాల్లో స్థానికులు టపాసులు కాల్చారు. ఈ నేపథ్యంలో వాయు నాణ్యత క్షీణించింది.
ఆదివారం సాయంత్రమే 100కు పైగా ఫిర్యాదులు
మరోవైపు అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఆదివారం సాయంత్రం నుంచి 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు దిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి 10.45 వరకు సుమారు 100 కాల్స్ వచ్చినట్లు చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.