దిల్లీలోని రోహిణీ కోర్టు ఆవరణలో కాల్పుల ఘటనపై(Delhi Court Shootout) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు(Delhi Court Shootout) సంబంధించి దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీజేఐ మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
పోలీసులు, బార్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడాలని సీజేఐ సూచించారు. కోర్టుల భద్రత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని అన్నారు. రోహిణి కోర్టులో కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై వచ్చే వారం ప్రాధాన్యం ఇస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
గ్యాంగ్స్టర్ జితేంద్ర అలియాస్ గోగీని రోహిణీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నారు దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ క్రమంలోనే.. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన దుండగులు గోగీపై కాల్పులు(Delhi Court Shootout) జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఇద్దరు దుండగులు హతమయ్యారు. ఇందులో ఒకరిపై రూ. 50 వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు దిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ అస్థానా. తీవ్ర గాయాలైన గోగీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు.