Satyendra Jain ED Custody: దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ కోర్టు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా జూన్ 9 వరకు పోలీసులకు సహకరించాలని ఆయనకు స్పష్టం చేసింది. పెద్ద కుట్రను వెలికితీసేందుకు కస్టడీ విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయల్. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో ఆయన్ను సోమవారం అదుపులోకి తీసుకుంది ఈడీ. జైన్ కుటుంబం, కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు గత నెలలో ఈడీ పేర్కొంది.
ఈడీ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 2015-17 మధ్యలో జైన్ దిల్లీ నుంచి కోల్‌కతాకు హవాలా రూపంలో డబ్బులు పంపారని కోర్టుకు తెలిపారు. షెల్ కంపెనీలు అన్నీ కోల్‌కతాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జైన్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఈడీ ఆరోపణలన్నీ నిరాధారమైనవేనన్న జైన్ తరఫు న్యాయవాది.. బెయిల్‌కు సంబంధించిన విచారణ జరగాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇరువురి వాదనల అనంతరం.. జైన్‌ను ఈడీ కస్టడీకి పంపుతూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ED grills Farooq Abdullah: జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మంగళవారం.. ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్‌ను మూడున్నర గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. జమ్ముకశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే.. తనను ఇరుకునపెట్టాలని కేంద్రం చూస్తున్నట్లు ఆరోపించారు ఫరూక్. జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ.. 2019 జులైలో ఫరూక్‌ను తొలిసారి ప్రశ్నించింది.