దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను దిల్లీ కోర్టు అంగీకరించింది. పోలీసుల అభ్యర్థన మేరకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించాలని కోర్టు సూచించినట్లు అఫ్తాబ్ తరఫు న్యాయవాది తెలిపారు.
నార్కో అనాలసిస్ అంటే?
నార్కో అనాలసిస్ అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్, స్కోపలామైన్,, సోడియం అమైథాల్) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్లను ప్రధాన సాక్షాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి.
డీఎన్‌ఏ నివేదిక ఆలస్యమెందుకో..?
ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ ఆమిన్ పూనావాలను అరెస్టు చేసి రెండు వారాలకు పైనే అయ్యింది. నిందితుడు చెప్పిన వివరాల మేరకు శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర భాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి మృతురాలివేనా? అని చెప్పేందుకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి ఆధారాల్లేవు. దీన్ని తేల్చేందుకు చేపట్టిన డీఎన్‌ఏ పరీక్షల నివేదిక ఇంతవరకూ రాకపోవడంపై ఫోరెన్సిక్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత కారణంగానే జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతుండటం గమనార్హం.
శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్‌ను నవంబరు 12న దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మెహ్‌రౌలీ అటవీ ప్రాంతంలో శ్రద్ధావిగా భావిస్తున్న కొన్ని శరీర అవశేషాలను గుర్తించిన పోలీసులు వాటిని నవంబరు 13న డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వచ్చిన డీఎన్‌ఏతో శ్రద్ధా కుటుంబ సభ్యుల డీఎన్‌ఏను సరిపోల్చి.. అవి మృతురాలివా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఇంతవరకు రాలేదు. దీనిపై అధికారులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. "ఇలాంటి కేసుల్లో మేం అత్యంత గోప్యత పాటిస్తాం. అందుకే ఆ శరీర భాగాల గురించి బయటకు ఎలాంటి వివరాలు చెప్పట్లేదు" అని రోహిణి ప్రాంత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అసిస్టెంట్ పీఆర్‌ఓ రజనీశ్ కుమార్ చెప్పారు.