ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన ఓ కానిస్టేబుల్‌పై వేటు పడింది. అక్టోబరు 27న అతడిని తన పైఅధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు.
ఎందుకు వేటు..?
ఉత్తర దిల్లీ జిల్లాలోని సబ్జి మండి ప్రాంతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే మనీశ్ మీనా... రైతుల ఆందోళనకు మద్దతుగా అక్టోబరు 9న తన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్టులు చేశారు. అందులో మోదీ, అమిత్ షాకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రాశారు. "రైతు వ్యతిరేక వర్గాలకు చెందినవారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయడంలో విఫలమైన వాళ్లు.. ఇప్పుడు రైతులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సోదరులారా, వాళ్లు నేర చరిత్రగలవారు. వాళ్లు మనుషులపై కార్లు ఎక్కిస్తారు" అని పేర్కొన్నారు.