Delhi CM House Renovation : దిల్లీ ముఖ్యమంత్రిఅధికారిక నివాసం పునర్నిర్మాణంలో నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై చర్యలకు ఉపక్రమించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ విషయంలో ప్రాథమిక విచారణను చేపట్టినట్లు సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. దిల్లీ ప్రభుత్వంలోని పలువురు అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. టెండర్ పత్రాలు, మార్బుల్ ఫ్లోరింగ్, మాడ్యులర్ కిచెన్ పనుల వివరాలు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు, భవనం ప్లాన్ ఆమోదం లాంటి పత్రాలను ఇవ్వాలని దిల్లీ ప్రజాపనుల శాఖను ఆదేశించినట్లు చెప్పారు. వీటితో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల రికార్డులను సైతం ఇవ్వాలని తెలిపారు.
'ఆప్‌ను అంతమొందిచేందుకు బీజేపీ ప్రయత్నాలు'
AAP On Kejriwal House Renovation : మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాస పునర్నిర్మాణంలో అక్రమాలపై వస్తున్న ఆరోపణలను ఖండించింది ఆమ్ఆద్మీ పార్టీ. ఆప్‌ను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఇందుకోసం తన అధికారాలన్నింటినీ ఉపయోగిస్తోందని విమర్శించింది. ఆప్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎంపీ సంజయ్ సింగ్. దేశంలోనే అత్యుత్తమ విద్య, వైద్యం అందించిన మంత్రుల మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్‌ను జైలులో వేశారన్నారు. ఎన్ని దర్యాప్తులు చేసినా.. కేజ్రీవాల్ సామాన్య ప్రజల కోసమే పోరాటం చేస్తారనని చెప్పారు.
కేజ్రీవాల్‌పై ప్రతిపక్షాల ఫైర్
BJP On Kejriwal House Renovation : ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడికి దిగాయి. అధికారంలోకి వచ్చాక సామాన్యుడిలా ఓ సాధారణ ఇంటిలో ఉంటానని చెప్పిన కేజ్రీవాల్.. ఆ మాటలను మరిచిపోయారని ఆరోపించాయి. తన నివాసం కోసం అనవసర ఖర్చు చేశారని విమర్శించాయి.