Delhi Air Quality Index Today :దేశ రాజధాని దిల్లీ కాలుష్యం కోరల మధ్య నలిగిపోతోంది. వరుసగా ఆరో రోజు కూడా దిల్లీలో వాయు నాణ్యాత తీవ్ర ప్లస్ కేటగిరీ స్థాయికి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి-సీపీసీబీ వివరాల ప్రకారం రాజధానిలోని చాలా ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 పాయింట్లు దాటింది. షాదీపుర్, వజీర్పుర్, ఓఖ్లా సహా పలు చోట్ల దట్టమైన పొగమంచు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల సమయంలో 415గా ఉన్న గాలి నాణ్యత.. మూడు గంటల్లో 460కి చేరింది. దీంతో ప్రజలు ఉదయపు నడక, క్రీడలు వంటి వాటికి దురమవుతున్నారు. దిల్లీతో పాటు దాని పొరుగున ఉన్న గాజియాబాద్, గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్ నగరాల్లో కూడా గాలి నాణ్యత ప్రమాదస్థాయిలో ఉంది.
Delhi Air Pollution :అయితే కేంద్ర వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళిక ప్రకారం.. ఏక్యూఐ 450 మార్క్‌ను దాటితే కాలుష్య కారకాలైన ట్రక్కులు, వాణిజ్య ఫోర్‌వీల్ వాహనాలు, అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలపై నిషేధం వంచి అత్యవసర చర్యలను అమలు చేస్తారు. అందులో భాగంగా BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని పొరుగు రాష్ట్రాల వాహనాలు దిల్లీ-ఎన్‌సీఆర్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఆదివారం లేఖ రాశారు. దీంతో పాటు దిల్లీ పొరుగు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరారు.
'గత రెండు రోజులుగా కాలుష్య స్థాయి పెరగడం వల్ల.. దిల్లీలో నిర్మాణాలపై నిషేధం విధించారు. శనివారంతో పోలిస్తే ఆదివారం కాలుష్య స్థాయి మెరుగుపడింది. అయితే పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్- సీఏక్యూఎమ్ ఇచ్చిన ఆదేశాలను మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. నింబంధనలు రూపొందిస్తున్నారు, సీఏక్యూఎమ్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది. కానీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇది మొత్తం ఉత్తర భారతం సమస్య' అని గోపాల్ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.