Delhi Air Pollution Today :దేశ రాజధాని ప్రాంతంలో శీతాకాలం కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాలుష్య స్థాయిలు బాగా పెరిగిపోయాయి. దిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో వాయు నాణ్యత సూచీ 221 నుంచి 341 మధ్య నమోదువుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం వాయు నాణ్యత సూచీ 100లోపు ఉంటే.. సంతృప్తకర స్థాయిగా చెబుతారు. వంద దాటితే మాత్రం అనారోగ్యానికి సూచికగా పరిగణిస్తారు.
దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతఅత్యంత నాసిరకంగా నమోదవుతోంది. ఆదివారం వాయు నాణ్యత సూచీ 309గా నమోదైంది. దిల్లీ యూనివర్శిటీ ప్రాంతంలో 341గా, IIT ప్రాంతంలో 300గా, లోథి రోడ్ ప్రాంతంలో 262గా నమోదైంది. దిల్లీ సమీపంలోని నోయిడాలో 372, గురుగ్రామ్‌లో 221గా నమోదైంది. దిల్లీలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్లు ఉన్నందున ఆకాశం నిర్మలంగా కనిపిస్తుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఉదయాన్నే నడక, పరుగు, జాగింగ్ చేసే వారు, పనుల కోసం వెళ్లే ప్రజలు.. కాలుష్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అనేక మందికి కళ్లలో మంట, శ్వాసకోస సమస్యలు వస్తున్నట్లు దిల్లీకి చెందిన డాక్టర్ నాగేంద్ర గుప్తా చెప్పారు. మాస్కులు పెట్టుకుని బయటకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదని ఆయన వివరించారు. రోజంతా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న ఆయన శీతాకాలం 3, 4 నెలలు ఏటా ఈ ఇబ్బంది తప్పడంలేదని చెప్పారు.
కాలుష్య నియంత్రణ కోసం దిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల శీతాకాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే వాహనం ఆపేయడం, బయోమాస్ కాల్చకుండా చూడడం, దుమ్ము, ధూళి రేగకుండా నీటిని చల్లడం వంటి చర్యలను దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించిన 15 పాయింట్ల కాలుష్య నియంత్రణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం ప్రకటించారు.