Delhi Air Pollution Level Today :దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. గత రాత్రి గాలి వేగం వల్ల వాయు కాలుష్య స్థాయిలు స్వల్పంగా తగ్గినప్పటికీ విషపూరితమైన PM2.5 సాంద్రత (గాలిలో 2.5 మైక్రోమీటర్ల కన్నా తక్కువగా ఉండే సూక్ష్మ కణాల సాంద్రత).. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే 80 రెట్లు ఎక్కువగా ఉంది.
వాయుకాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ, కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వరుసగా ఐదో రోజు శనివారం కూడా దట్టమైన విషపూరితమైన పొగమంచు వ్యాపించింది. గాల్లో ఉండే PM2.5 సాంద్రత గల సూక్ష్మ రేణువులు శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయని వైద్యులు తెలిపారు. అలాంటి PM2.5 సాంద్రత.. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితి క్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల కంటే 7-8 రెట్లు ఎక్కువగా నమోదైంది.
దిల్లీలో గురువారం, శుక్రవారం తీవ్ర స్థాయి వాయు కాలుష్యానికి.. పంట వ్యర్థాలు తగలబెట్టడం ద్వారా వచ్చిన పొగనే 35 శాతం కారణం అని పుణెకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ అభివృద్ధి చేసిన న్యూమరికల్ మోడల్ ఆధారిత వ్యవస్థ ద్వారా తెలుస్తోంది. ఇక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్- సీపీసీబీ గణాంకాల ప్రకారం, దిల్లీ వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 మధ్య 200 పాయింట్లకు పైగా పెరిగింది. ఇది శుక్రవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీకి (450 పైన) దిగజారింది.
కాలుష్యం తగ్గడానికి.. యాక్షన్ ప్లాన్..
అనవసరమైన నిర్మాణ పనులతో సహా కొన్ని కాలుష్య కార్యకలాపాలపై దిల్లీ- ఎన్సీఆర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలను రూపొందించే కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ) అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నియంత్రణల కారణంగా.. కాలుష్య స్థాయి మరింత తగ్గుముఖం పడుతుందని వారు భావిస్తున్నారు. అయితే కఠినమైన నియంత్రణలు కాకుండా.. గ్రేడెట్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
ఉదయపు నడక బంద్
ప్రమాదకర వాయు కాలుష్యం కారణంగా దిల్లీ- ఎన్సీఆర్లోని ప్రజలు ఉదయపు నడక, క్రీడలు తదితర బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. మరోవైపు పిల్లలు వేగంగా ఊపిరి పీల్చుకుంటారని, కాలుష్య కారకాలను ఎక్కువగా తీసుకుంటారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.