తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యం గెలిచింది.. అభివృద్ధి పరుగులే.. ఆ అధికారులకు 'మ్యూజిక్' వాయిస్తా!' - అరవింద్ కేజ్రీవాల్ లేటెస్ట్ స్పీచ్

దిల్లీలో పాలనా సర్వీసులపై స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దిల్లీ ప్రజలకు న్యాయం లభించిందని పేర్కొన్నారు. తాజా తీర్పుతో దిల్లీలో అభివృద్ధి వేగం అనేక రెట్లు పుంజుకుంటుందని కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు.. సుప్రీం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ తెలిపింది. అయితే దిల్లీ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు వారి సామర్థ్యాల ఆధారంగా కాకుండా.. ముఖ్యమంత్రికి ఎంత విధేయత చూపుతున్నారనే దాని ఆధారంగా వారికి పోస్టింగ్‌లు లభిస్తాయని దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్​దేవా విమర్శించారు.

delhi administrative services supreme court
delhi administrative services supreme court

By

Published : May 11, 2023, 10:08 PM IST

దేశ రాజధాని దిల్లీలో పాలనా సర్వీసులపై స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. అదేసమయంలో కొందరు అధికారులకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు.
'దిల్లీ ప్రజలకు ఇప్పటికి న్యాయం లభించింది. ఈ తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. తాజా నిర్ణయంతో దిల్లీలో అభివృద్ధి వేగం అనేక రెట్లు పుంజుకుంటుంది. పరిపాలనను అడ్డుకున్న అధికారులకు ఇక 'మ్యూజిక్' ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా దిల్లీలో మెరుగైన పాలన అందించాం' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు.. అధికారుల నియామకాలు, బదిలీల అధికారం ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వానికి దక్కిందని ఆమ్ఆద్మీ పార్టీ తెలిపింది. కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్​కు అధికారులపై ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది.

'సత్యమేవ జయతే.. దిల్లీ గెలిచింది'
సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. 'సత్యమేవ జయతే. దిల్లీ గెలిచింది. ఇక్కడి అధికారులు.. స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలందించాలని.. పాలనను స్తంభింపజేసేందుకు కేంద్రం నియమించిన, ప్రజలు ఎన్నుకోని వ్యక్తుల (ఎల్‌జీ) ద్వారా కాదన్న కఠిన సందేశాన్ని తాజా తీర్పు పంపుతోంది' అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. మరోవైపు.. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు.. తమ ప్రభుత్వానికి దాని హక్కును కట్టబెట్టిందని మంత్రి అతిషీ అన్నారు. 'సీఎం కేజ్రీవాల్ దిల్లీ ప్రజల కోసం ఎనిమిదేళ్లు న్యాయ పోరాటం చేశారు. ఈరోజు ప్రజలు గెలిచారు' అని మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. దిల్లీలో ఆప్​ ప్రభుత్వం ఇప్పుడు పూర్తి వేగంతో పని చేస్తుందని.. అధికారులు సరిగ్గా పని చేయాల్సి ఉంటుందని దిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అన్నారు.

తీర్పు వెలువడిన గంటల్లోనే..
ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన పాలనా అధికారాలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే దిల్లీలోని ఆప్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవల విభాగం కార్యదర్శి అశిశ్ మోర్​కు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జల్ బోర్డు మాజీ సీఈవో ఏకే సింగ్​ను నియమించింది.

'విధేయత ఆధారంగానే పోస్టింగ్​లు'
దిల్లీలో పాలనా సర్వీసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్​దేవా అన్నారు. 'మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ తమ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు జరుగుతాయని అన్నారు. దిల్లీ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు వారి సామర్థ్యాల ఆధారంగా కాకుండా.. ముఖ్యమంత్రికి ఎంత విధేయత చూపుతున్నారనే దాని ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తారు.' అని ఆయన ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details