తిహార్ జైలులో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్ని దిల్లీ పోలీస్ ప్రత్యేక కార్యదళం ఆదివారం అరెస్ట్ చేసింది. గతేడాది ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో అదే జైలులో ఉన్న నిందితులను హత్య చేసేందుకు ఈ ముష్కరులు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. వీరిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన అబ్దుల్లా బాసిత్, అజిమోషన్గా గుర్తించారు.
దిల్లీ అల్లర్ల కేసు నిందితులను హత్య చేసే పనిని... అదే కేసులో నిందితుడు, తిహార్ జైలులోనే ఉండే షాహిద్‌కు అప్పగించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. షాహిద్‌కు, అస్లామ్ అనే వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వినడం ద్వారా ఈ విషయం కనుగొన్నట్లు తెలిపారు.
"దిల్లీ అల్లర్ల కేసు నిందితుల హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఆ పనిని షాహిద్ అనే ఖైదీకి అప్పగించారు. ఈ విషయంపై షాహిద్‌ను ఇప్పటికే విచారించాము. తోటి ఖైదీలతో జైలులో ఘర్షణకు దిగి, ఆ గందరగోళంలో ఈ హత్యలు చేయాలని అతడు భావించాడు. జైలులోకి పాదరసం తీసుకురావాలని అస్లాం అనే వ్యక్తికి సూచించాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ఆదేశాలు రాగానే... దిల్లీ అల్లర్ల కేసు నిందితుల శరీరాల్ని పాదరసంతో విషతుల్యం చేసి, హత్య చేయాలని కుట్ర పన్నాడు."