ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేయడానికి.. భారత్ సైనిక స్థావరాలపై నిఘా పెట్టడానికి మాత్రమే పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగిస్తూ వచ్చింది. అయితే ఆదివారం జమ్ము వైమానిక స్థావరంపై దాడి.. డ్రోన్లతో భవిష్యత్తులో భారత్‌కు పెనుముప్పు పొంచి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా దేశంలోని కీలక సైనిక స్థావరాల రక్షణకు మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ దాడి నొక్కి చెబుతోందని వారు పేర్కొంటున్నారు. రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ఎగురుతూ విధ్వంసం సృష్టించే డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొనే సాంకేతికత ప్రస్తుతం భారత్ దగ్గర లేదు.
గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో పాక్ సైన్యం జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు ఆయుధాలు, నగదును డ్రోన్లతో పంపుతూనే ఉంది. పంజాబ్‌లోకి మాదక ద్రవ్యాలను చేరవేస్తూనే ఉంది "డ్రోన్లను మెరుగ్గా కట్టడి చేసే సాంకేతికత మన దగ్గర లేదు. ప్రస్తుతమైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి డ్రోన్లను అడ్డుకుంటున్నాం" అని ఒక సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు.