అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు భారత్‌కు సవాలేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(rajnath singh) పేర్కొన్నారు. అక్కడ నెలకొన్న పరిణామాలతో ప్రభుత్వం కూడా తన వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సి వచ్చిందని అన్నారు.
"అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు మనకు సవాలే. ఈ నేపథ్యంలో మన వ్యూహాన్ని(india strategy on afghanistan) పునరాలోచించుకోవాల్సి వచ్చింది. మనం వ్యూహాలను మార్చుకొన్నాం. ఈ మార్పులకు అనుగుణంగానే క్వాడ్ (QUAD) కూడా ఏర్పడింది" అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
బ్యాటిల్ గ్రూప్‌ల ఏర్పాటు
తమిళనాడులోని వెల్లింగ్టన్ ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ సర్వీస్ అండ్ స్టాఫ్ కళాశాలలో ప్రసంగించిన ఆయన.. కొత్త వ్యూహంలో భాగంగానే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్(integrated battle groups india)ల ఏర్పాటు కోసం రక్షణశాఖ కసరత్తులు చేస్తోందని చెప్పారు. 'యుద్ధ సమయంలో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ బృందాలు సత్వర నిర్ణయాలను సులభతరం చేయడమే కాకుండా యుద్ధ బృందాల సంఖ్యను కూడా పెంచుతాయి' అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
బలంగా ఉన్నాం కాబట్టే...
ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు రాజ్‌నాథ్. రెండు యుద్ధాల్లో ఓడిపోవడం వల్ల.. పొరుగుదేశం పరోక్ష యుద్ధానికి తెరలేపిందని, ఇందుకోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అన్నారు. ఆ దేశ విధానాల్లో ఉగ్రవాదం కూడా ఓ భాగమైందని ధ్వజమెత్తారు. భారత్ బలమైన స్థితిలో ఉంది కాబట్టే.. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విజయవంతమైందని చెప్పారు.
మరోవైపు, చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో ఆర్మీపై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్. సైన్యం తెలివిగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఏ సమయంలోనైనా, ఎలాంటి ప్రత్యర్థితోనైనా తలపడేందుకు సిద్ధమని భద్రత దళాలు మరోసారి రుజువు చేశాయని అన్నారు.
విదేశాంగ శాఖ సంప్రదింపులు
ఇదిలా ఉంటే.. అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై మిత్ర దేశాలతో భారత్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్(us india on afghanistan) ఇప్పటికే చర్చలు జరిపారు. అక్కడి పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలపైనా ఇరువురు తమ ఆలోచనలను పంచుకున్నట్లు కేంద్రమంత్రి జైశంకర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇక కాబుల్ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్ల(kabul airport attack) ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో తన వ్యూహాలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:బైడెన్ సమర్పణలో.. 'హాలీవుడ్ తాలిబన్'!