ఇటలీకి చెందిన హెలికాప్టర్ల తయారీ సంస్థ అగస్టా వెస్ట్‌లాండ్(Agustawestland case), దాని మాతృసంస్థ లియోనార్డో కంపెనీలపై గతంలో విధించిన నిషేధాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ(Defence ministry of India) తొలగించింది. 2014లో అగస్టా వెస్ట్‌లాండ్(Agustawestland case) నుంచి రూ.3,500 కోట్ల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఒప్పందాన్ని రద్దు చేసిన రక్షణ శాఖ... ఆ కంపెనీలను 'వ్యాపార లావాదేవీల నిషేధిత జాబితా'లో చేర్చింది.
తాజాగా ఈనెల 12న జారీ చేసిన నిషేధిత జాబితాలో ఆ కంపెనీల పేర్లు లేవని రక్షణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. 2014 నాటి ఒప్పందం రద్దుకు పరిహారంగా రూ.2,979 కోట్లు చెల్లించాలంటూ ఇన్నాళ్లుగా భారత్‌ను కోరుతున్న లియోనార్డో కంపెనీ... ఆ దావాను ఉపసంహరించుకుంటూ ఇటీవల లేఖ ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే కేంద్రం వాటిపై నిషేధాన్ని తొలగించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం భారత్ చేపడుతున్న భారీ నౌకా విధ్వంసకాయుధాల తయారీ ప్రాజెక్టులో పాల్గొనేందుకు ఆ కంపెనీలకు(Agustawestland case) అవకాశం వచ్చిందని కూడా వివరించాయి.