Defence procurement: సైన్యం కోసం 28,732 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో డ్రోన్‌లు, కార్బైన్‌లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన రక్షణ సేకరణ మండలి(డీఏసీ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తూర్పు లద్దాఖ్ వద్ద చైనాతో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న వేళ.. పెద్దమొత్తంలో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
సుమారు 4లక్షల బ్యాటిల్ కార్బైన్‌లు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా చిన్నపాటి ఆయుధాలు తయారుచేసే సంస్థలకు ఈ నిర్ణయం మంచి ఊపునిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి భద్రతను మరింత పటిష్ఠం చేయడం సహా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న సైన్యానికి రక్షణ కోసం బీఐఎస్-6 స్థాయి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.