రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఏసీ)' సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాలకు రూ.76,390 కోట్లు విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలు, తయారీలో భాగంగా ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
"భారత సైన్యం కోసం.. స్వదేశీ సంస్థల నుంచి ఫోర్క్ లిఫ్ట్ ట్రక్కులు, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంకులు, యాంటీ ట్యాంక్ గైడెన్ మిసైల్స్ కలిగిన యుద్ధ వాహనాలు, రాడార్లను గుర్తించే ఆయుధాలు కొనుగోలు చేసేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది. నౌకాదళం కోసం.. రు.36వేల కోట్లతో నెక్స్ట్ జనరేషన్ కొర్వెట్(ఎన్జీసీ)లను కొనుగోలు చేసేందుకు ఆమోదం లభించింది. అత్యాధునిక సాంకేతికతతో సరికొత్త అంతర్గత డిజైన్ ఆధారంగా ఈ ఎన్జీసీలను నిర్మించనుంది నౌకాదళం. మరోవైపు.. స్వదేశీ ఎయిరో ఇంజిన్ సామగ్రి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సుఖోయ్-30 ఎంకేఐ ఎయిరో ఇంజిన్లను తయారు చేసేందుకు డీఏసీ ఆమోదం తెలపింది. "
- రక్షణ శాఖ