Defence Minister Rajnath Singh: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో రష్యా- ఉక్రెయిన్ కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 22 వేల మంది భారత విద్యార్థులను కాపాడేందుకు వ్లాదిమిర్ పుతిన్‌కు, వొలొదిమిర్ జెలెన్స్కీకి మోదీ ఫోన్లు చేసి మాట్లాడారని గుర్తు చేశారు. చార్బాగ్ ప్రాంతంలోని రబీంద్రాలయ్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు జీవితం పట్ల దిశానిర్దేశం చేశారు. తన గురువు మౌల్వీ సాహిబ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నారు.
భారత్ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని కొన్ని రోజులు ఎలా ఆపారో అనే విషయాన్ని విద్యార్థులకు వివరించారు. అందులో భాగంగా ప్రధాన మంత్రి ఇరు దేశాలను యుద్ధాన్ని కొద్ది రోజులు ఆపాలని అడిగారని అన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా మాట్లాడారన్నారు. దీంతో ఇరుదేశాలు యుద్ధానికి కొన్ని రోజులు విరామం ఇచ్చాయని చెప్పారు. దీంతో భారత విద్యార్థులను అక్కడినుంచి సురక్షితంగా స్వదేశానికి తీసువచ్చారన్నారు. రెండు దేశాల మధ్య ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధాన్ని, మూడో దేశం కారణంగా ఆపడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో భారత్‌కు ఎంత గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన ద్వారా చెప్పొచ్చని పేర్కొన్నారు.
ఇదే సక్సెస్ మంత్ర..
ప్రసంగంలో భాగంగా విద్యార్థులకు విజయ మంత్రాన్ని ఉపదేశించారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా గౌరవ, మర్యాదలతో మెలగాలని సూచించారు. కొన్ని పరిమితులను ఎప్పటికీ దాటవద్దన్నారు. "రావణుడు గొప్ప పండితుడు అయినప్పటికీ, మనం అతడిని పూజించము. కానీ రాముడిని పూజిస్తాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు గౌరవాన్ని పాటించాడు. అందరినీ గౌరవించాడు. అందుకే అతడిని మర్యాద పురుషోత్తం అని అంటాం. మనం కూడా పరిమితులకు లోబడి జాగ్రత్తగా ఉండాలి. అలా అందరితో మర్యాదగా, గౌరవంగా ఉంటేనే సమాజంలో మనకూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలా సంఘంలో గౌరవమర్యాదలు సంపాదించడమే గొప్ప ఆస్తి" అని చెప్పారు.