Rajnath Singh Handed Over Weapons: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ బోట్‌లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేర్చగలదు. దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక శక్తి పెరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు.
సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలను నిశితంగా పరిశీలించేందుకు.. దేశీయంగా తయారు చేసిన డ్రోన్ వ్యవస్థ కూడా భారత అమ్ములపొదిలో చేరింది. ఈ నిఘా డ్రోన్ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టగలుగుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ డ్రోన్ వ్యవస్థ సాయంతో సరిహద్దులో భారత్ బలం మరింత పెరగనుంది. వాటితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైనికులకు F-INSAS వ్యవస్థకు సంబంధించిన AK-203 అసాల్ట్ రైఫిల్స్‌ను రాజనాథ్ సింగ్ అందజేశారు.