Deepfake Prevention Govt Measures : డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలను పూర్తిగా నియంత్రించేందుకు త్వరలోనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం గురువారం సోషల్ మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇలాంటి (డీప్‌ఫేక్) వీడియోలను అరికట్టేందుకు మీడియా డిటెక్షన్, ప్రివెన్షన్, రిపోర్టింగ్ మెకానిజం సహా ఇతర అంశాలతో కూడిన ఓ బలోపేతమైన వ్యవస్థ అవసరమని గుర్తించినట్లుగా మంత్రి వివరించారు. ఈ వ్యవహారంలో సామాజిక మాధ్యమాలతో కలిసి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
'అవసరమైతే కొత్త చట్టం తెస్తాం..'
టెక్నాలజీ సాయంతో డీప్‌ఫేక్ సృష్టిస్తున్న నష్టం ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పును తెచ్చిపెడుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 'మేము డీప్‌ఫేక్ నియంత్రణనకు సంబంధించి ఈరోజే ముసాయిదా పనులను ప్రారంభిస్తాము. తక్కువ సమయంలోనే ఇందుకు కావాల్సిన కొత్త నిబంధనలు తయారు చేస్తాము. సాంకేతికత దుర్వినియోగం విషయంలో ఇప్పటికే ఉన్న ఫ్రేమ్‌వర్క్‌ను సవరించాలా లేదా కొత్త నిబంధనలు తీసుకురావాలా, అవసరమైతే చట్టాని తీసుకురావచ్చా అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నాం' అని మంత్రి వ్యాఖ్యానించారు.
"డీప్‌ఫేక్ అనేది సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇటీవలి కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే వీటికి సంబంధించి నిబంధనలు, విధి విధానాలను తీసుకువస్తాము. ఈ విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కలిసి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాము."
- అశ్విని వైష్ణవ్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి