బంగాల్లో 'ఉద్యమం' అనగానే తొలుత గుర్తొచ్చేది నందిగ్రామ్. ఆ ఉందంతాన్ని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. కానీ అందుకు దశాబ్దాల ముందే.. హింసాకాండతో బంగాల్ అట్టుడికింది. ఆ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచింది 'నక్సల్బరి.' ఆ ప్రాంతం చరిత్ర చూస్తే.. ఎన్నో పోరాటాలు, తిరుగుబాట్లు, రక్తపు మరకలు కనపడతాయి. అలాగే వామపక్షాల ఆధిపత్యమూ దర్శనమిస్తుంది.
అలాంటిది నక్సల్ బరిలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 'ఎర్ర' కోట కాస్తా.. కాషాయ రంగులోకి మారుతోంది! ఇక్కడ భాజపా పట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇందుకు తగ్గట్టుగానే.. నక్సల్బరి వీధుల్లో కాషాయ జెండాలు పాతుకుపోయాయి. ఈ అనూహ్య మార్పునకు కారణాలేంటి? ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపు లాంఛనమేనా?
నాడు..
1967లో.. గ్రామస్థుల తిరుగుబాటుతో నక్సల్బరి పేరు నాడు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. నక్సల్బరిలోని భూముల్లో పంటలు పండించేందుకు హక్కులు కోరుతూ అక్కడి రైతులు ఉద్యమించారు. పోలీసులు వారిపై కాల్పులు జరపడం వల్ల హింసాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో.. ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 11మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:-బీడువారిన సింగూరు బతుకులు!
ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కను సన్యాల్ అనే మావోయిస్టు నేత పేరును ఆ ప్రాంతానికి పెట్టారు. ఆ తర్వాత అక్కడ నక్సల్స్ కార్యకలాపాలు, తిరుగుబాట్లు పెరిగాయి.
నేడు..
భౌగోళికంగా.. నేపాల్ సరిహద్దు, హిమాలయాలకు సమీపంలో ఉంది ఈ నక్సల్బరి. అభివృద్ధి, రాజకీయాల పరంగా.. దశాబ్దాల కాలంగా ఇక్కడ కొన్ని మార్పులు వచ్చాయి. ఉత్తర బంగాల్‌కు వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన సిలిగుడికి నక్సల్బరి 25 కిలోమీటర్ల దూరం. ఈ రెండింటిని అనుసంధానం చేసే రోడ్లపై.. ఇప్పుడు వాణిజ్యపరంగా ఎంతో వృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే.. రక్తపాతం, తిరుగుబాటు నుంచి అభివృద్ధివైపు నక్సల్బరి అడుగులు వేస్తోందన్న ఆశ చిగురిస్తుంది.
అయితే.. నక్సల్బరిలో అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మార్పులు లేవని అనుకునే వారూ ఉన్నారు. అక్కడ ఉండే గుడిసెలు, రోడ్లను పేదరికానికి చిహ్నాలుగా అభివర్ణిస్తున్నారు.
కమలం ఎంట్రీ...
ఇటీవలి కాలంలో బంగాల్ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చాయి. దాదాపు పదేళ్లుగా ఏకపక్షంగా ఆధిపత్యాన్ని చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్‌కు 'భాజపా' రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురైంది. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంపై కమలదళం పట్టు విపరీతంగా పెరిగింది. నక్సల్బరి ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.
ఎన్నికల నేపథ్యంలో నక్సల్బరి వీధుల్లో భాజపా జెండాలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. కమలదళం ప్రచారాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోతోంది.
ఇదీ చూడండి:-పూలమ్మిన చోటే.. కట్టెలమ్ముతున్న కామ్రేడ్లు!
ఒకప్పుడు వామపక్షాల కంచుకోటగా ఉన్న నక్సల్బరిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అని అందరూ అనుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు గ్రామస్థులే చెబుతున్నారు.