India Corona Third wave: కరోనా రెండో దశతో పోల్చితే మూడో దశలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యం, మరణం ముప్పు కూడా తగ్గిందని పేర్కొంది. వ్యాక్సినేషన్ వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.
దేశంలో టీకాకు అర్హులైన వయోజనుల్లో 94శాతం మంది తోలి డోసు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 72మందికి రెండు డోసులు పూర్తయినట్లు చెప్పింది. 15-18ఏళ్ల వయసువారిలో 52శాతం మంది పిల్లలు టీకా మొదటి డోసు తీసుకున్నారని వివరించింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 50వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని, 515 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతానికిపైగా ఉందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Corona vaccination
160కోట్లు దాటిన టీకాలు
వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం వరకు 160కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసింది.
సోమవారం నుంచి స్కూళ్లు ఓపెన్..
మహారాష్ట్రలో జనవరి 24నుంచి సూళ్లను తిరిగి తెరవనున్నట్లు విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ వెల్లడించారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కరోనా కేసులు పెరిగిన కారణంగా జనవరి మొదటి వారం నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మూసివేశారు. అయితే విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని, స్కూళ్లు తెరవాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వచ్చాయి. ముంబయిలో మాత్రం జనవరి 31వరకు పాఠశాలలు ముసివేసే ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
కర్ణాటకలో ఆంక్షలపై శుక్రవారం నిర్ణయం
కర్ణాటకలో కరోనా ఆంక్షల విషయంపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి ఆర్ ఆశోక తెలిపారు. ప్రజల జీవితాలు, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఈ విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలు, రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆంక్షలపై ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం 1:00గంటలకు సమావేశమై చర్చిస్తారని, ఆ తర్వాత ప్రకటన ఉంటుందని వివరించారు. వివిధ రాజకీయ పక్షాల సలహాలు, సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
కరోనా కేసులు పెరిగిన కారణంగా కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే శుక్రవారం నుంచి వీటిని ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:టీకా వద్దంటూ సిబ్బందిపై దాడి.. మరొకరు చెట్టెక్కి..