West Bengal Violence 2023 : బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఘటనల్లో మరణించినవారి సంఖ్య 15కు పెరిగింది. పోలింగ్ రోజు వివిధ పార్టీలకు చెందిన 12మంది చనిపోగా.. ఆదివారం మరో ముగ్గురు మృతిచెందారు. దక్షిణ 24పరగణాల జిల్లాలోని పశ్చిమ గబ్‌టాలా పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడిని టీఎంసీ కార్యకర్త అబు సలెంఖాన్‌గా గుర్తించారు. నిన్న జరిగిన అల్లర్లలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు కూడా టీఎంసీ కార్యకర్తలే అని పేర్కొన్నారు.
West Bengal Violence Death Toll : పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు టీఎంసీకి చెందినవారు 11మంది మృతిచెందగా.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం మద్దతుదారులు ఒక్కొక్కరు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో మృతుడిని గుర్తించాల్సి ఉందన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం మొత్తం 18మంది చనిపోయినట్లు పేర్కొన్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ సంభవించిన మరణాలపై సమగ్ర నివేదిక పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. 24 గంటల్లో నివేదిక సమర్పించాలని కోరినట్లు.. ఈసీ అధికారులు చెప్పారు.
మరోవైపు.. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలతోపాటు పోలింగ్ సందర్భంగా అక్రమాలను నిరసిస్తూ.. పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. శ్రీకృష్ణాపుర్ హైస్కూల్ కౌంటింగ్ సెంటర్‌లో బ్యాలెట్ బాక్స్‌లను ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ .. పూర్వ మిడ్నాపుర్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జాతీయ రహదారిని దిగ్బంధించాయి.