కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లా కొక్కయార్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు, కొట్టాయం కూట్టిక్కల్లో 12 మంది మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అలప్పుజా, కొట్టాయం జిల్లాలు వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్, తిరువనంతపురం, కొల్లం, పతనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. నిరాశ్రయుల కోసం.. రాష్ట్రవ్యాప్తంగా 281 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 10 వేలకుపైగా ప్రజలు అక్కడ ఆశ్రయం ఉంటున్నారు.
కేరళలో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైన్యం, రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగం.. సహాయక చర్యలు చేపడుతున్నాయి. వాయుసేన విమానాలు కూడా బాధితులను తరలించేందుకు సహాయపడుతున్నాయి.