Death threat Letters Karnataka: కర్ణాటకలో ప్రముఖులకు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమార స్వామితో పాటు 61 మంది రచయితలకు ఈ లేఖలు వచ్చాయి. చంపేస్తామంటూ వచ్చిన ఈ లేఖలు ఎవరు పంపించారనేది తెలియలేదు. ఈ లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులు ముస్లింల పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణించారు.
'ఏ క్షణంలోనైనా చంపేస్తాం'.. మాజీ సీఎంలకు బెదిరింపు లేఖ - హెచ్డీ కుమార స్వామి బెదిరింపు లేఖ
Death threat Letters Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ లేఖ రాశారు. మరో 61 మంది రచయితలకు సైతం ఇదే తరహా లేఖలు అందాయి.

'వీరందరూ హిందుమత ద్రోహులు. ఏ క్షణంలోనైనా మీకు మృత్యువు లభించవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి' అని లేఖలో రాశారు. లేఖ చివర్లో 'ఓ సహనం కలిగిన హిందువు' అని రాసి ఉంది. ఈ లేఖపై స్పందించిన మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి.. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని తెలిపారు. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే పటిష్ఠ భద్రత కల్పించాలని కోరారు. తాను దేవుడిని విశ్వసిస్తానని, ఈ విషయంలో తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి:'హైబ్రిడ్ ఉగ్రవాదుల కేసు'లో 25మందిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్