కొవిడ్-19 టీకా మూడో దశ క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి 9 రోజుల తర్వాత మరణించాడు. అయితే ఈ మరణానికి టీకాతో సంబంధం లేదని వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తెలిపింది.
క్లినికల్ ప్రయోగాల్లో భాగంగా భోపాల్లోని పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో సదరు వ్యక్తి (42) గత నెల 12న టీకా పొందాడు. అదే నెల 21న అతడు చనిపోయాడని ఆ విద్యా సంస్థ ఉపకులపతి రాజేశ్ కపూర్ చెప్పారు. గుండె, ఊపిరి ఆగిపోవడం వల్ల అతడు మరణించి ఉంటాడని, దీనికి విష ప్రయోగం కారణమై ఉండొచ్చని శవపరీక్ష నిర్వహించిన వైద్యుడు పేర్కొన్నట్లు మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అశోక్ శర్మ తెలిపారు.