తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Deaf Lawyer Sara Sunny : సుప్రీంకోర్టులో దివ్యాంగ మహిళా న్యాయవాది సైగల వాదన.. చరిత్రలో ఫస్ట్​ టైమ్​ - తొలిసారిగా సైగలతో వాదనలు వినిపించిన సారా సన్నీ

Deaf Lawyer Sara Sunny : దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఓ అరుదైన సన్నివేశం జరిగింది. దివ్యాంగురాలు(మూగ, చెవిటి) అయిన ఓ మహిళా న్యాయవాది ఓ కేసును తన సైగలతో వాదించారు. కాగా, ఇలా సైన్​ లాంగ్వేజ్​లో కేసును వాదించడం దేశంలో ఇదే తొలిసారి.

Supreme Court allows Sarah Sunny, practising deaf lawyer, to argue in sign language
Deaf Lawyer Sara Sunny Latest News

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 5:43 PM IST

Deaf Lawyer Sara Sunny : దివ్యాంగురాలు (మూగ, చెవిటి) అయిన ఓ మహిళా న్యాయవాది సైగలతో తన వాదనలు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వినిపించారు. ఇలా సైన్ లాంగ్వేజ్​ (సైగలతో కూడిన భాష)లో కేసును వాదించడం దేశంలో ఇదే మొదటిసారి. సుప్రీం కోర్టులో సోమవారం ఈ అరుదైన సన్నివేశం జరిగింది.

తొలిసారిగా సంజ్ఞలతో వాదనలు!
దివ్యాంగులకు సంబంధించి ఓ కేసు విషయంలో వర్చువల్‌గా విచారణ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు సీనియర్​ న్యాయవాది సంచితా ఐన్​ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం సైన్​ లాంగ్వేజ్​లో సారా సన్నీ వాదనలు వినేందుకు అంగీకరించింది. అనంతరం ఈ విచారణలో వాదోపవాదనలు సారా సన్నీకి అర్థమయ్యేలా సైన్​ లాంగ్వేజ్ నిపుణుడు సౌరభ్​ రాయ్‌ చౌదరికి కూడా అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరారు​. అయితే ఇందుకు సుప్రీంకోర్టు కంట్రోల్​ రూమ్​ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయాన్ని సంచితా ఐన్..​ సీజేఐ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం 'ఫర్వాలేదు.. ఆయన కూడా స్క్రీన్​లో జాయిన్​ కావచ్చు' అంటూ సీజేఐ వెంటనే ఆమెదం తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ వివరాలను సౌరభ్​ రాయ్‌ సంజ్ఞలతో సారా సన్నీకి వివరించారు. ఆయన సాయంతో సారా సన్నీ కోర్టులో సైగలతో తొలిసారి వాదనలు వినిపించారు.

ఆసక్తిగా తిలకించారు!
వ్యాఖ్యాత(ఇంటర్​ప్రిటర్​) సౌరభ్​ రాయ్​ చౌదరీ సంజ్ఞ భాషలో కేసు వివరాలను దివ్యాంగ న్యాయవాది సారా సన్నీకి వివరిస్తున్న తీరును కోర్టు రూమ్​లోని ప్రతిఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. కాగా, వీటిని అర్థం చేసుకొని వర్చువల్​ విధానంలో వాదనలు వినిపించారు సారా సన్నీ. కాగా, సీజీఐ ముందు ఇంత వేగంగా, అది కూడా సైగల ద్వారా కేసును వాదించడం అద్భుతమని అక్కడే ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆశ్చర్యానికి గురయ్యారు. సారా సన్నీని మెచ్చుకున్నారు.

సీజేఐకు థ్యాంక్స్​!
సారా సన్నీ.. సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్​ న్యాయవాది సంచితా ఐన్​ వద్ద జూనియర్​ లాయర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీజేఐ జస్టిస్​ చంద్రచూడ్​కు సారా సన్నీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక తాను భవిష్యత్తులో వ్యాఖ్యాత సాయంతో వాదనలు వినిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ కేసు..
భూమిక ట్రస్టు వ్యవస్థాపకుడు​, అధ్యక్షుడు జయంత్​ సింగ్​ రాఘవ్​(చూపు లేదు) సోమవారం పీడబ్ల్యూడీ హక్కుల చట్టం-సెక్షన్ 24లోని నిబంధనను తమకు(దివ్యాంగులకు) అమలు చేయాలని వాదించారు. ఈ చట్టం ప్రకారం.. సామాజిక సంక్షేమ పథకాలు, సహాయం విషయంలో సాధారణ వ్యక్తులకు అందిస్తున్న సాయం కన్నా తమకు(దివ్యాంగులకు) 25 శాతం అధికంగా లబ్ధి అందాలని.. దీనిని అమలు పరిచే విధంగా చొరవ తీసుకోవాలని జయంత్​ సింగ్​ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యావహారంపైనే దివ్యాంగ న్యాయవాది సారా సన్నీ సైగల ద్వారా వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం.. సంబంధిత కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కాగా, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

ABOUT THE AUTHOR

...view details