తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హత్య కేసులో శిక్ష.. ఏడేళ్ల క్రితం 'చనిపోయిన' మహిళను తీసుకొచ్చిన నిర్దోషులు - తెలుగు క్రైమ్ వార్తలు

సస్పెన్స్ థ్రిల్లర్​ను తలపించే ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. తప్పుడు కేసులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు నానా ప్రయత్నాలు చేసి తమను తాము నిర్దోషులుగా నిరూపించుకున్నారు. ఏడేళ్ల క్రితం చనిపోయిన యువతిని తిరిగి తీసుకొచ్చారు. అదెలా సాధ్యమైందంటే?

Dead woman found alive after 7 years
Dead woman found alive after 7 years

By

Published : Dec 12, 2022, 9:58 AM IST

ఏడేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన మహిళ తిరిగి వచ్చింది! ఆమెను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే ఆ మహిళను గుర్తించి తీసుకొచ్చారు. తమను తాము నిర్దోషులుగా నిరూపించుకునేందుకు మహిళను పట్టుకున్నారు. మారువేషాల్లో తిరుగుతూ మహిళ ఆచూకీని కనుగొన్నారు.
వివరాల్లోకి వెళ్తే..
చనిపోయిందనుకొని భావించిన మహిళ పేరు ఆర్తి. ఉత్తర్​ప్రదేశ్​లోని మథురా జిల్లా నివాసి. 2015లో ఆర్తి కనిపించకుండా పోయింది. అదే సమయంలో ఓ మహిళ మృతదేహం బృందావనం పట్టణంలో లభ్యమైంది. శవం గుర్తుపట్టలేని స్థితికి చేరుకోవడం వల్ల.. పోలీసులు పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించి అంత్యక్రియలు జరిపించారు. ఆ తర్వాత ఆర్తి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమార్తె రాజస్థాన్​లోని దౌసా పట్టణానికి చెందిన సోనూ సైనీతో వెళ్లిపోయిందని పోలీసులకు చెప్పాడు. అతడే తన కుమార్తెను హత్య చేశాడని ఆరోపించాడు. పోలీసులు గుర్తించిన మృతదేహం తన కుమార్తెదేనని తెలిపాడు.

ఆర్తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోనూ సైనీతో పాటు ఉదయ్​పుర్​కు చెందిన అతడి స్నేహితుడు గోపాల్ సింగ్​ను అరెస్ట్ చేశారు. అయితే, బెయిల్​పై వచ్చిన నిందితులు.. తమను తాము నిర్దోషులమని నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు, మహిళ బతికే ఉందని గుర్తించారు. రాజస్థాన్ దౌసా జిల్లాలోని విశాల అనే గ్రామంలో భర్తతో కలిసి ఆర్తి నివసిస్తోందని తేల్చారు.

సోనూ సైనీ, గోపాల్ సింగ్

"బెయిల్​పై జైలు నుంచి బయటకు రాగానే ఆర్తి కోసం వెతకడం ప్రారంభించాం. ఆర్తి ఉంటున్న ఓ గ్రామానికి చెందిన వ్యక్తి నన్ను కలిశాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ విశాల గ్రామంలో ఉంటోందని చెప్పాడు. ఆమె ఆర్తినేనని నాకు అనుమానం వచ్చింది. దీంతో ఎలాగైనా ఆమెను చూడాలని ఓసారి కూరగాయలు అమ్మేవాడిలా ఆ గ్రామానికి వెళ్లా. ఒంటెను కొనేందుకు అని మరోసారి వెళ్లి వచ్చా. ఇలా వెళ్లిన సమయంలో ఆర్తి ఎవరో కనిపెట్టా. వెంటనే మెహందీపుర్ పోలీసులను ఆశ్రయించా. కానీ, ఆర్తి ఐడీ కార్డును తీసుకురావాలని అడిగారు. ఐడీ కార్డు లేకుంటే సహాయం చేయలేమని చెప్పారు. ఆమె ఐడీ కార్డు సంపాదించేందుకు నాకు రెండేళ్లు పట్టింది."
-సోనూ సైనీ

ఐడీ కార్డు వివరాలు చూసిన తర్వాత స్థానిక పోలీసులు ఉత్తర్​ప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు కలిసి.. సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆర్తి, ఆమె భర్త భగవాన్ సింగ్ రేబరితో నివసిస్తోందని గుర్తించారు. వెంటనే ఆర్తి కుటుంబ సభ్యులను పిలిపించారు. ఇన్నేళ్లూ ఆర్తి.. తన కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉందని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. సోనూ, గోపాల్​ ఆర్తి హత్య కేసులో జైల్లో ఉన్నారని తెలిసినా.. కేసు వెనక్కి తీసుకోలేదని గుర్తించారు. అనంతరం వారు పెట్టిన కేసు బూటకమని తేల్చారు. ప్రస్తుతం ఆర్తిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసు వల్ల తాను సర్వస్వం కోల్పోయానని సోనూ భావోద్వేగానికి గురయ్యాడు. 'నా అరెస్టును తట్టుకోలేక నా తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసు వల్ల నాకు రూ.20 లక్షలు అప్పులయ్యాయి. నేను అన్నీ కోల్పోయాను' అని సోనూ చెప్పాడు.

ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఓ బాలిక హత్యకు గురైందని భావించారు. ఇందులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన నిందితుడి తల్లి.. అదృశ్యమైన యువతి కోసం సొంతంగా గాలించగా ఇటీవలే ఆమె కంటపడింది. ఈ కథనం పూర్తి వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details