ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతి మృతదేహాన్ని అనేక ముక్కలుగా చేసి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడేశారు నిందితులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు పోలీసులు.
ప్రస్తుతం ఈ కేసులో నిందితులిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అహ్రాలా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిందీ ఘటన. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 2 రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
వివాహేతర సంబంధం కారణంగా..
బిహార్‌లోని ఆరాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడిని.. ఆమె భర్త, అత్తమామలు, బావ కర్రలతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని చందన్ తివారీ(26)గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు చందన్, రూబీ దేవి అనే యువతి.. బనారస్‌లోని ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఇరువురు ధామ్వాల్ గ్రామానికి చెందినవారే. అయితే రూబీదేవికి రాజు పాసవాన్ అనే వ్యక్తితో 2018లో వివాహమైంది. అయినా చందన్, రూబీ మధ్య వివాహేతర సంబంధం మాత్రం ఆగలేదు. రూబీ దేవిని కలిసేందుకు వెళ్లగా చందన్ తలపై ఆమె భర్త, బావ కర్రలతో దాడిచేసి చంపేశారు.