Dead Body Found After 3 Years : స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు వ్యక్తులు. అనంతరం మృతదేహాన్ని ఓ పొలంలో ఖననం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో మూడేళ్ల క్రితం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల పాటు తమ మిత్రుడు కనిపించకుండా పోయాడంటూ అందరినీ నమ్మించారు నిందితులు.
ఇదీ జరిగింది
మల్హర్ చౌకి ప్రాంతానికి చెందిన వికాస్ అనే యువకుడు గత మూడేళ్ల క్రితం కనిపించకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ కుమారుడి స్నేహితులపైనే అనుమానం ఉందంటూ, వారిని విచారించాలని అనేక సార్లు పోలీసులకు చెప్పారు వికాస్ తల్లిదండ్రులు. చాలా కాలంగా కేసును విచారిస్తున్న పోలీసులు, స్నేహితులను అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టారు.
నగదు విషయంలో వివాదం తలెత్తి వికాస్ గొంతు నులిమి హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారు. అనంతరం అందరూ కలిసి మృతదేహాన్ని ఓ పొలంలో సమాధి చేసినట్లు అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. జేసీబీ సాయంతో మట్టిని తవ్వి యువకుడి ఎముకలను బయటకు తీశారు. వీటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిస్తామని పోలీసులు చెప్పారు. ఫలితాలు వచ్చిన తర్వాతే కేసుపై స్పష్టత వస్తుందని తెలిపారు.