DGCI Grants Emregency Use Of Vaccine: దేశంలో టీకా పంపిణీని మరింత విస్తరిస్తూ చిన్న పిల్లలకు కొవిడ్ టీకా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి- డీసీజీఐ అత్యవసర అనుమతి మంజూరు చేసింది. దీంతో పాటు 5 నుంచి 12 ఏళ్ల వారికి బయోలాజికల్ - ఇ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాను పంపిణీ చేసేందుకు కూడా డీసీజీఐ అనుమతులిచ్చింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొవాగ్జిన్ టీకాను ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. దీన్ని చిన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ భారత బయోటెక్ గతంలో దరఖాస్తు చేసుకుంది. పిల్లలపై నిర్వహించిన క్లినికల్ పరీక్షల సమాచారాన్ని, సంబంధిత ఇతర వివరాలను అందజేసింది. 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్ టీకా పంపిణీ కోసం బయోలాజికల్ - ఇ సంస్థ కూడా దరఖాస్తు చేసుకుంది. వీటి సమాచారాన్ని, ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ.. ఎస్ఈసీ గత గురువారం భేటీ అయ్యింది. 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు కొవాగ్జిన్ టీకాను, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్ టీకాను ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా.. డీసీజీఐకి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనల మేరకు ఈ టీకాలకు అత్యవసర అనుమతులను డీసీజీఐ జారీ చేసింది.