Deceased Daughters Rights In Inherited Property :మరణించిన కుమార్తెలకు కుడా వారసత్వ ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వారికి వాటా నిరాకరించడం రాజ్యాంగ సమానత్వ సూత్రానికి విరుద్ధం అని వ్యాఖ్యానించింది. నారగుండాకు చెందిన చన్నబసప్ప హోస్మయి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ సచిన్ శంకర్ మగడం నేతత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
హిందూ వారసత్వ చట్టం-2005 సవరణకు ముందు మరణించిన కుమార్తెలు వారసత్వ ఆస్తికి వారసులు కారని పిటిషనర్ వాదించారు. అయితే పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు, కుమారుడు చనిపోయాక ఎలాగైతే పిత్రార్జిత ఆస్తిలో హక్కు ఉంటుందో, కుమార్తెలకు కూడా అలాగే ఉంటుందని పేర్కొంది. ఇలాంటి విషయాల్లో కుమారులు, కుమార్తెలనే వివక్ష ఉండకూడదని తేల్చి చెప్పింది. ఇలాంటి వివక్ష చూపిస్తే అది న్యాయ సంఘర్షణకు దారితీస్తుందని తెలిపింది. అందుకే కుమార్తెలకు కూడా సమాన హక్కులు కల్పించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది.
"రాజ్యాంగ సమానత్వ సూత్రాలను కోర్టులు కాపాడాల్సి ఉంటుంది. లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి. హిందూ వారసత్వ చట్టం 2005కు ముందు మరణించిన మహిళలకు సమాన హక్కులు కల్పించకపోతే, అది లింగ వివక్షతను శాశ్వతం చేస్తుంది. చట్ట సవరణల ద్వారా మహిళల హక్కులు హరించివేయలేరు"
--కర్ణాటక హైకోర్టు