తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Inhuman Incident in kamareddy : కాసుల కోసం కూతుళ్ల కక్కుర్తి.. ఏ కన్నతల్లికి రాకూడదీ దుస్థితి - Inhuman incident in Kamareddy district latest news

Inhuman Incident in kamareddy : నేటి కాలంలో మానవ సంబంధాలు.. మనీ సంబంధాలుగా మారుతున్నాయి. ఆస్తుల కోసం ఆప్తులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. సొంతవారనే కనికరం లేకుండా కత్తికో ఖండాన నరికేస్తున్నారు. రక్త సంబంధం కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొన్నిసార్లు కన్నతల్లిదండ్రులు అని కూడా లెక్కచేయకుండా పిల్లలు కన్నవారిపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆస్తి కోసం కొందరు తల్లిదండ్రులను బతికుండగానే జీవచ్ఛవాలుగా మారుస్తుంటే.. మరికొందరేమో కాసుల కోసం కక్కుర్తి పడి దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది.

Kamareddy district
Kamareddy district

By

Published : May 7, 2023, 5:01 PM IST

Inhuman Incident in kamareddy : కాసుల కోసం కన్నపేగు అన్న కనికరం కూడా చూపలేదు ఆ పిల్లలు. కొందరు కొడుకులు తల్లిదండ్రులను తిప్పలు పెడతారు.. కానీ కూతుళ్లు మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటారని అనుకునేవాళ్లం. కానీ నేటి సమాజంలో కొంతమంది కుమార్తెలు కూడా కన్నబంధాని కంటే కాసులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కానీ ఆమె కుమార్తెలు మాత్రం.. తమకు ఆస్తి పంపకాలు చేయలేదని, బ్యాంకులో డిపాజిట్ ఉన్న డబ్బులు ఇవ్వలేదని తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లి దహనసంస్కారాలు చేయడానికి నిరాకరించారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌బీనగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ (70) అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 21న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి కిష్టవ్వకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మరోవైపు చికిత్స పొందుతున్న సమయంలో ఆస్తి కోసం కుమార్తెలు ఆమెపై దాడి చేశారు. కిష్టవ్వ పేరిట ఇల్లు, బ్యాంకులో ఖాతాలో రూ.1,70,000 ఉన్నాయి. అవి తమకు ఇవ్వాలని కుమార్తెలు పట్టుబట్టారు. అందుకు కిష్టవ్వ నిరాకరించింది. మృతురాలి పేరిట ఉన్న ఆస్తులకు నామినీగా ఓ బంధువు ఉన్నారు. తల్లి తన ఆస్తిని తమకు ఇవ్వకుండా వేరే వాళ్ల పేరిట రాయడంతో కుమార్తెలు ఆమెపై ఆగ్రహించారు.

సొమ్ము ఇస్తేనే శవాన్ని తీసుకెళ్తాం:ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కిష్టవ్వ మరణించింది. వైద్యులు కిష్టవ్వ మరణం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. మృతురాలి బ్యాంకు ఖాతాలో సొమ్ము ఇస్తేనే శవాన్ని తీసుకెళ్తామని తేల్చి చెప్పడంతో.. వైద్యులు కిష్టవ్వ మృతదేహాన్ని శవాగారంలోనే ఉంచారు. బిడ్డలున్నా అనాథగా తల్లి మృతదేహాన్ని వదిలేయడం పలువురు హృదయాల్ని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి చేరుకొని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details