Daughter reunites Parents in Karimnagar :ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అంతర్వేదిలో.. 2016లో తండ్రి రవికుమార్‌తో పాటు కూతురు ఆక్ష కనిపించకుండా పోయింది. ఆర్థిక సమస్యలతో భార్య ద్వారకతో ఏర్పడిన మనస్పర్ధల వల్ల రవికుమార్ తన కూతురు ఆక్షను తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే కూతురు ఆక్షను.. తండ్రే తీసుకుపోయాడన్న విషయం తెలియని తల్లి.. చిన్నారి కోసం ఊరూరూ వెతికింది. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సహకారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దిల్లీ వరకు వెళ్లి పాప కోసం వెతికింది. కానీ చిన్నారి జాడ లభించలేదు.
Daughter reunited with Parents in Karimnagar :మరోవైపు.. భార్యకు చెప్పకుండా బిడ్డతో పాటు ఇళ్లు విడిచి వెళ్లిన రవికుమార్.. అప్పటి నుంచి పుణేలో ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల రెండో వివాహం చేసుకోవాలన్న ఆలోచనతో ఓ దిన పత్రికలో ప్రకటన ఇచ్చాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన భాగ్యలక్ష్మి.. రవికుమార్‌ను వివాహం చేసుకునేందుకు సిద్ధపడింది. ఆ తర్వాత భాగ్యలక్ష్మి పిల్లలతో పాటు ఆక్షను తీసుకొని సైదాపూర్‌కు వచ్చింది. అయితే ఆక్ష మాట్లాడుతున్న భాష తీరు కొంత తేడాగా అనిపించడంతో గ్రామస్థులు భాగ్యలక్ష్మిని అనుమానించారు. చిన్నారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటారని భావించి పోలీసులకు సమాచారమిచ్చారు.
- ఇవీ చూడండి..:బలగం సినిమా.. బంధుత్వాలను కలిపింది
Couple Reunited by Daughter in Karimnagar..: విచారణ చేపట్టిన పోలీసులు, శిశు-సంక్షేమ శాఖ అధికారులు.. పాప పూర్వాపరాలు, తల్లిదండ్రుల వివరాలు రాబట్టారు. ఆ వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. వాటిని చూసి ఆక్ష తమబిడ్డేనని వేర్వేరు చోట్ల నుంచి ఇద్దరు వ్యక్తులు అధికారులను సంప్రదించారు. చివరకు ఆక్ష తన మనవరాలని పద్మ అనే మహిళ సమర్పించిన ఆధారాలు పరిశీలించిన పోలీసులు.. ఆక్ష తల్లి ద్వారకను పిలిపించారు. ఆరేళ్ల క్రితం విడిపోయిన భార్యాభర్తలు చిన్నారి ఆక్ష కోసం పోలీసుల సమక్షంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో.. మనస్పర్ధలు వీడి పాపతో పాటు కలిసి ఉండేందుకు అంగీకరించారు.
'నేను పుణెలో జాబ్ చేసుకునేటప్పుడు రెండో పెళ్లి కోసం ప్రకటన ఇచ్చాను. సైదాపూర్‌కు చెందిన భాగ్యలక్ష్మి అనే ఆవిడ మా దగ్గరకు వచ్చి మా పాపకు దగ్గరైంది. మార్చి నెలలో నాకు చెప్పకుండా పాపను తీసుకుని సైదాపూర్‌కు వచ్చింది. అప్పటి నుంచి నేను వెతికినా దొరకలేదు. ఈరోజు శిశు సంక్షేమ శాఖ అధికారులు నా పాపను నాకు అప్పగించారు. నా భార్యాబిడ్డలతో ఇప్పుడు సంతోషంగా ఉంటాను.' - రవికుమార్, పాప తండ్రి
- ఇవీ చూడండి..:విడిపోయి... కలిసుండటం మంచిదేనా?