ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయించిన యువతి స్నేహ కాంబళెను కర్ణాటక రాష్ట్రం బెళగావి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి అయిన రోహిణి కాంబళె, ఆమె ప్రియుడు అక్షయ విఠకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. పోలీసులకు అనుమానం కలగకుండా ఉండాలని 'దృశ్యం' సినిమాను వారు ముగ్గురు పదిసార్లు చూసినట్లు విచారణలో తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావికి చెందిన భూవ్యాపారి సుధీర్ కాంబళె గతంలో దుబాయ్‌లో పని చేసేవాడు. కరోనా సమయంలో బెళగావిలోని క్యాంప్ ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాడు. సుధీర్, రోహిణిల కుమార్తె స్నేహ. మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు ఆమెకు అక్షయ్ విఠకర్ పరిచయమయ్యాడు. వారి ప్రేమ విషయాన్ని సుధీర్ ఇటీవల గుర్తించి కుమార్తెను మందలించాడప. దీంతో తండ్రి అడ్డు తప్పించాలని ఆమె భావించి విషయాన్ని తల్లికి చెప్పగా.. హత్యను ఆమె ప్రోత్సహించింది.