Daughter Conspired With Lover To Kill Father : ప్రేమకు అడ్డువస్తాడని తండ్రిపై దాడి చేయించింది ఓ కూతురు. ప్రియుడితో కలిసి ఈ కుట్రకు పాల్పడింది. అందుకు నలుగురు వ్యక్తులకు రూ.60వేల సుఫారీకూడా ఇచ్చింది. పథకం ప్రకారం సోమవారం రాత్రి తండ్రిపై దాడి చేయించింది. ఘటనలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. కేసులో కూతురు, ఆమె ప్రియుడితో పాటు దాడి చేసిన నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోలాపుర్ జిల్లాలోని మధ తాలుకాకు చెందిన మహేంద్ర షా.. ఆ చుట్టుపక్క ప్రాంతంలో పేరుమోసిన వ్యాపారవేత్త. అతని కూతురు సాక్షి. ఈమె చైతన్య అనే యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకునేందుకు.. మహేంద్ర కాళ్లు విరగ్గొట్టాలని పన్నాగం పన్నారు. అందుకు ఓ పథకం కూడా రచించారు.
పథకంలో భాగంగానే పుణెకు వెళ్లిన సాక్షి.. ఆదివారం రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్ దిగి తండ్రిని రమ్మని ఫోన్ చేసింది. దీంతో కూతురుని ఇంటికి తీసుకువెళ్లేందుకు కారులో వచ్చాడు మహేంద్ర. అనంతరం తిరిగి వెళుతుండగా.. వాడచివాడి గ్రామ సమీపంలో టాయిలెట్ వస్తుందని కారును ఆపింది సాక్షి. ఆ వెంటనే రెండు బైక్‌లపై కారును అనుసరిస్తు వస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు. దారుణంగా కొట్టి.. అతని రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు.