కర్ణాటకలో ఓ మహిళ కదలలేని స్థితిలో.. మంచంపైనే కోర్టు విచారణకు హాజరైంది. ఆస్తి విషయంలో కన్నకొడుకే మోసం చేయడం వల్ల ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు వారు వద్దని చెప్పినా సరే.. బాధితురాలు తన బాధను చెప్పుకోవడానికి కుమార్తె, బంధువుల సహాయంతో విచారణకు హాజరైంది.
అసలు ఏం జరిగిందంటే..?
చామరాజనగర్ జిల్లా కొల్లెగల ప్రాంతంలోని ముంతాజ్ బేగం అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు, ఆరుగురు కొడుకులు ఉన్నారు. ముంతాజ్ భర్త నిసార్ అహ్మద్ కొంతకాలం క్రితం తన పేరుపై 3.2 ఎకరాల భూమిని కొన్నారు. నిసార్ అహ్మద్ మృతి చెందారు. అయితే ఆ భూమిని చిన్న కొడుకు అబ్దుల్ రజాక్.. హజ్ యాత్రకు పాస్పోర్ట్ ఇప్పిస్తానని చెప్పి తన పేరుపై మార్చుకున్నాడు. ముంతాజ్ పేరుపై లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. దాని గురించి అడిగితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు చిన్న కొడుకుపై ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007 కింద దరఖాస్తు చేసింది.