Dashrath Samadhi Ayodhya :మనలో చాలా మందికి శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు గురించి తెలుసు. దశరథుడు మరణించిన తర్వాత ఆయనకు అయోధ్యలోనే దహన సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించినట్లు తెలుస్తోంది. రామాలయం ప్రారంభం తర్వాత భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో ప్రాశస్త్యం ఉన్న ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తోంది. అందులో ఈ దశరథ్ సమాధి స్థల్ కూడా ఉంది. ఈ ప్రాంతం రామమందిరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దశరథుని దహన సంస్కారాలను రాజ్యంలో అంతకుముందు ఏ అంత్యక్రియలు జరగని ప్రదేశంలో నిర్వహించాలని భరతుడు అనుకున్నాడని ఇక్కడి పూజారి మహంత్ దిలీప్ దాస్ తెలిపారు. మంత్రులు, ప్రజలను అలాంటి స్థలాన్ని వెతకమని భరతుడు సూచించాడని, చివరకు ఈ ప్రదేశాన్ని కనుగొన్నారని వివరించారు. సరయు నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని బిల్వహరి ఘాట్ అంటారని దిలీప్‌దాస్ చెప్పారు. ఇక్కడ దశరథుడిని దహనం చేసి ఆ చితాభస్మాన్ని సమాధిలో భద్రపరచారని వెల్లడించారు.
ప్రస్తుతం రామమందిరం నుంచి బిల్వహరి ఘాట్‌కు చేరుకునేందుకు నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాగే పార్కింగ్ కోసం కూడా స్థలాన్ని కేటాయించారు.
"దశరథ్ సమాధి స్థల్ రోడ్డు ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. దీనిని ఏ-బీ బంధా రోడ్ అని పిలుస్తాం. నాలుగు వరుసల రహదారి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది దశరథ్ సమాధి మీదుగా వెళ్లి సుల్తాన్‌పుర్ ప్రయాగ్‌రాజ్ హైవేకు కలుస్తుంది. అయోధ్య వారసత్వాన్ని నిలుపుకునేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం."
--విశాల్ సింగ్, అయోధ్య అభివృద్ధి అథారిటీ వైస్ ఛైర్మన్