ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలన్న చైనా ఆశయాలు, ఆకాంక్షలు.. దక్షిణ ఆసియాలో స్థిరత్వానికి పెను ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని త్రిదళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్(CDS Bipin Rawat) తెలిపారు. ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా పెద్ద సంఖ్యలో రహదారుల నిర్మాణం చేపడుతోందని చెప్పారు. ఈ మేరకు అసోం గువాహటిలో నిర్వహించిన రవికాంత్ సింగ్ తొలి స్మారక ఉపన్యాసం చేశారు రావత్(CDS Bipin Rawat).
"దక్షిణాసియాలో భౌగోళిక వ్యూహాత్మక పోటీని మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చైనా తన అవసరాల కోసం వివిధ దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల కొంతకాలంగా చైనా సైన్యం సహాయాన్ని బంగ్లాదేశ్, మయన్మార్లు పొందుతున్నాయి. నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లోనూ ఆ దేశం తన ప్రభావాన్ని పెంచుకునేందుకు పెట్టుబడులు పెడుతోంది. మయన్మార్, బంగ్లాదేశ్‌లో చైనా చేపడుతున్న చర్యలు.. భారత ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమైనవి. ఇవి భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా చేస్తున్న కుట్రలు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రాంతీయ స్థిరత్వానికి పెను ప్రమాదం పొంచి ఉంది. అది భారత ప్రాదేశిక సమగ్రతకు, వ్యూహాత్మక ప్రాముఖ్యతకు ముప్పుగా పరిణమించవచ్చు."
-జనరల్ బిపిన్ రావత్, త్రిదళాధిపతి