ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విషాదం నెలకొంది. గ్రామంలో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు వ్యక్తుల ఆగడాలకు అడ్డు చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ దళిత యువకుడ్ని అతిదారుణంగా చంపేశారు దుండగులు. అతడి చొక్కాతోనే కరెంట్ స్తంభానికి ఉరేసి హత్య చేశారు. అయితే తమ కుమారుడ్ని గ్రామ పెద్దలే హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం..కేదారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పచారా గ్రామంలో అక్టోబరు 5న ఓ దళిత మహిళపై ఆ ఊర్లోని పెద్ద మనుషులుగా వ్యవహరించే వ్యక్తులు అఘాయత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం అదే గ్రామానికి చెందిన సేతన్ భూయాన్ అనే యువకుడికి తెలిసింది. దీంతో ఈ అన్యాయాన్ని సహించక అఘాయిత్యానికి పాల్పడిన కుటుంబసభ్యులను నిలదీద్దామని సేతన్ వెళ్లాడు. కానీ వారే తిరిగి అతడి కుటుంబంపైన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సేతన్ జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు తెలియజేశాడు.