Dalit Woman Stripped Urinated :బిహార్‌లోని పట్నా జిల్లాలో ఓ దళిత మహిళపై వడ్డీ వ్యాపారితో పాటు అతడి అనుచరులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. మహిళను వివస్త్రను చేసి దారుణంగా దాడి చేశారు. అనంతరం ఆమె నోట్లో మూత్ర విసర్జన చేయించాడు. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే?
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. జిల్లాలోని ఖుస్రుపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త.. కొన్నాళ్ల క్రితం ప్రమోద్ అనే వ్యక్తి వద్ద రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. కొద్దిరోజులకు వడ్డీతో సహా అంతా చెల్లించేశాడు. కానీ ప్రమోద్.. ఇంకా ఎక్కువ డబ్బులు కట్టాలని డిమాండ్ చేశాడు. అందుకు బాధితురాలి కుటుంబం నిరాకరించింది. దీంతో బాధిత మహిళకు ఫోన్ చేసిన ప్రమోద్.. తాను చెప్పిన మొత్తాన్ని చెల్లించకపోతే వివస్త్రను ఊరేగిస్తానని బెదిరించాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్.. తన అనుచరులతో బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి వివస్త్రను చేసి కర్రతో దాడి చేశారు.
"నా నోటిలో మూత్ర విసర్జన చేయమని ప్రమోద్ తన కుమారుడిని చెప్పాడు. వెంటనే అతడు అలా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి తిరిగొచ్చాను. అప్పుగా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించినా ఈ చిత్రహింసలు భరించాల్సి వచ్చింది" అని మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.
ఈ ఘటనపై పట్నా ఎస్పీ రాజీవ్ మిశ్ర స్పందించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. బాధిత మహిళ ప్రస్తుతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు.
కొద్దిరోజుల క్రితం.. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామంలోని వేరే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ.. వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు ఆమె భర్త. అందుకు బాధితురాలి అత్తమామలు కూడా సహకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల విషయం బయటపడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.