Dalit Teenager Beaten Drink Urine :బాలికను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ దళిత బాలుడిపై క్రూరంగా దాడి చేశారు కొందరు యువకులు. అతడికి మూత్రం తాగించి, కనుబొమ్మలు పీకేసి, నోట్లో బురద కుక్కి కొట్టారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌లో జరిగింది. సుజన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇరుపక్షాలు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
ఓ బాలిక తాను కళాశాలకు వెళ్తుండగా.. కొందరు వేధిస్తున్నారని ఇంట్లో వాళ్లకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆ బాలుడిని ఖుతహాని గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద పట్టుకుని దారుణంగా కొట్టారు. అతడిని బురదలో పడేసి కొడుతూ.. నోట్లో మట్టి కుక్కారు. అంతటితో ఆగకుండా మూత్రాన్ని తాగించారు. ఆ తర్వాత అతడి కనుబొమ్మలు సైతం పీకేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాలుడి తండ్రిని సైతం కొట్టారు. అనంతరం ఇరుపక్షాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం
రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన బిహార్ బెతియా జిల్లాలో జరిగింది. ప్రస్తుతం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.